Monday 18 May 2015

ఎర్ర చొక్కా

ఎర్ర చొక్కా 
-----------
మావీదిలో ఎవరయినా ఎగుడు దిగుడు గా చొక్కా గుండీలు పెట్టుకుని , 
గాలి పటాలు ఎగరవేస్తునో, 
ఇటుకరాయికి తాడు కట్టి బస్సులాగా సౌండు తో సహ లాగుతునో, 
రోడ్డు మొదట్లోని బంకు వద్ద నుండి రెండు ఇడ్లీల పోట్లాన్ని ముద్దు పెట్టుకుంటూ నడుస్తునో ..
ఒక గజం ఎత్తు పిల్లాడిని మీరు గమనిస్తే వాడే బాలాజీ . 
.
బాలాజీ మా వీది చివర్లో ఉన్న వర్కింగ్ క్లాస్ ఉండే రేకుల ఇంట్లో
అద్దెకుండే తల్లి, తండ్రి ,చెల్లళ్లతో ఉంటాడు. 
వాడి తండ్రి ని మీరు ఎప్పుడయినా తాగని స్థితిలో చూడాలంటే 
కనీసం నెల రోజులు అక్కడే కాపు వేయాలి.
.
తల్లి నాలుగు ఇళ్ళల్లో పాచి పనో, పక్క ఊరిలోని వ్యవసాయ పనులో 
చేసి పొయ్యిలో పిల్లి పడుకోకుండా కాలం వెళ్లదీస్తుంది. 
అలాటి బాలాజీ కి ఒక పెద్ద సమస్య వచ్చింది.
.
మా వీడి లోనే సాయి బాబా ఛారిటీ స్కూల్ లో చదువుతుంటాడు వాడు. 
ఆ స్కూల్ ప్రిన్సిపల్ పేరు ఓబులరెడ్డి మాస్టారు. 
వాడా స్కూల్ లో చదవటానికి ప్రదాన కారణం . అక్కడంతా ఉచితం. 
బోదనా రుసుం ఉండదు. మద్యాన్న బోజనమ్ ఉచితం.
పుస్తకాలు , పలకలు, బలపాలు ఇస్తారు , సాయంత్రం బిస్కెట్ లు లాటివి ఇస్తారు .
ఇక గురువారాలు సరే సరి. లాయరు పేట సాయిబాబా గుడి నుండి 
అనేక రకాల ప్రసాదాలతో పిల్లలందరికి వడ్రసోపితమ్. 
సంవత్సరానికి రెండు జతలు బట్టలు కూడా ఇస్తారు.
ఆ రెండు జతల బట్టలు, తల్లి పనిచేసే ఇళ్ళలో ఎవరయినా ఇచ్చిన పాత బట్టలు వాడి ఆహార్యం.
.
ఒక పొడి రోజు తండ్రి, కొడుకుని ముద్దు చేస్తూ .. 
మా ఆబ్బాయికి ఈ సారి పండక్కి కొత్త చొక్కా కుట్టియ్యాలి అన్నాడు.
సరిగ్గా వాడి ఆదిదే.. 
.
తల్లి “బులుగు చొక్కా కుట్టిచ్చు వాడికి బులుగు మీది పులంటే చాలా ఇష్టం” అంది...
.
“ఆహా నాకు ఎర్ర చొక్కా కావాలి ,, నాలుగు జేబులు ఉండాలి,
పెద్ద కాలరు , మూడు పెద్ద గుండీలు “ బాలాజీ చెప్పాడు
అప్పుడప్పుడు ఓబులురెడ్డి మాస్టారి ఇంట్లో టి‌వి లో చూసిన 
పాత జేమ్స్ బాండ్ సినిమాలో ఒకాయన వేసుకున్న చొక్కా వాడికి గుర్తొచ్చింది.
.
సరే రా అన్నడా తండ్రి. ఖచ్చితంగా కుట్టిస్తాను అని హామీ ఇచ్చాడు.
.
బాలాజీ ఇక ఎవర్ని వదల్లేడు , 
తాతా మానాన్న ఎర్ర చొక్కా కుట్టిత్తా నన్నాడు,
నాలుగు జేబులు , పెద్ద కాలరు మూడు పెద్ద గుండీలు .. .
అవ్వా మా నాన్న.. సారు మా నాన్న .. మేడమీద ఆంటీ మానాన్న , 
బజార్ బజారంతా చెప్పేశాడు. స్కూల్ మొత్తం చెప్పాడు. 
తోటి పిల్లలందరికి ఎర్ర చొక్కా గురించి చెప్పాడు ,
మా వీదిలో కూరగాయలమ్మే అవ్వ నుండి ,
పాత సామానుకి ఉల్లి పాయలు ఇచ్చే వాడిదాకా అందరికీ వాడి ఎర్ర చొక్కకి ,
నాలుగు జేబులు, పెద్ద కాలరు , మూడు పెద్ద గుండీలు ఉంటాయని తెలిసి పోయింది. 
.
అలాటి బాలాజీ తండ్రి , తల్లి రోజు మాదిరిగానే ఆ రోజు పోట్లాడుకున్నారు. 
మామూలు గానే తిట్టు కున్నారు . 
మాములుగానే బయట అరుగుమీద పడుకున్న
బాలాజీ తండ్రి మర్నాటి ఉదయానికి కనబడలేదు. 
ఎక్కడికి వెల్లాడో ఎవరు గమనించలేదు.
మరెప్పుడు అతన్ని ఎవరు చూడలేదు. .
.
చానాళ్ళు బాలాజీ తల్లి మానంగా ఉండి పోయింది. 
అయ్య ఎక్కడి కి పోయాడు అని చాలా సార్లు బాలాజీ అమ్మ ని అడిగాడు
కానీ మౌనమే ఆమె సమాదానం అయ్యింది. 
.
గుండ్రని రంగు గోళీల లాటి వాడి కళ్ళు .. 
రంగులు కోల్పోవటాన్ని , గమనించింది ఒక్క ఓబులురెడ్డి మాస్టారే.
.
అలా చాలా రోజులు గడిచాక ..
గతం లో బాలాజీ చాలా కాలం కలలు కన్నపెద్ద పండగ రానే వచ్చింది...
.
ఆ ఉదయం బాలాజీ నిద్ర లేచే లోగా ఓబులరెడ్డి మాస్టారు వాడి ఇంటికి వెళ్లారు. 
.
వాడిని నిద్ర లేపి తన చేతి లో పొట్లం చించి ఎర్ర చొక్కా, చూపించాడు.
పెద్ద కాలరు , నాలుగు జేబులు , మూడు పెద్ద గుండీలు ...
.
బాలాజీ కళ్ళు ఒక్క సారిగా మెరిసి తిరిగి మామూలయ్యాయి.
.
“మా అయ్యా ఇక రాడా ? “
.
వాడి ప్రశ్న కి సమాదానం ఎవరి వద్దా లేదు..
frown emoticon frown emoticon frown emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...