Monday, 18 May 2015

రెండు పిలకల పొట్టి పిల్ల

ఆ రెండు పిలకల పొట్టి పిల్ల అంటేనే నాకు కచ్చ...
దొంగముఖంది. దాని చూపంతా నా వైపే .
మానాన్న పనిచేసే స్కూల్లో రెండో పంతులి కూతురు ఇక్కడ నా క్లాస్ మేట్.
చిటుక్కు మంటే చాలు నేరుగా మా పంతులు గారికి పితూరీలు.
.
మొన్నటికి మొన్న వెనక బెంచీ లో వెంకట్రావు గాడి పక్కన కూర్చున్నానా
దీనికేందుకు. మాకు మాకు అనేకం ఉంటాయి.
వాడు మాత్స్ లో కొంచెం వీకు.
కొత్త లెక్కల మాస్టారు తేడా వస్తే బెత్తం తో ఎముకలు లెక్క బెడుతున్నాడు.
పాపం వెంకట్రావు కి ఏదో మాట సాయం ,
పంతులు క్లాసు మధ్యలో పాటం ఆపి ఏదో అడుగుతాడు.
పసిబిడ్డ వెంకటరావు కొంచెం అందిస్తే అల్లుకుపోతాడు.
అయినా నాకు లేని అబ్యంతరము ఆ రెం. పి. పో. పి. కి ఎందుకుట?.
.
సార్ రోశయ్య పంతులు గారి అబ్బాయి (మనమే) వెనక బెంచీలో కూర్చున్నాడు సార్..
వెంకట్రావుకు అందిస్తున్నాడు సార్.... చెప్పనే చెప్పింది. దొంగ ముఖం ది.
.
దీనికేం తెలుసు వెంకట్రావు గాడి సంచీలో ఉన్న సజ్జ బూరెల రుచి.
కొత్త పంతులు కేం తెలుసు.
ఏ మాట కా మాటే గాని వాళ్ళ అమ్మ ఏంచేసిగా రుచిగా ఉంటాయి.
ఒక్కసారి రుచి చూశారంటే
కొత్త పంతులు కూడా వెనక బెంచిలో వెంకట్రావు పక్కన కూర్చోవాల్సిందే..
.
"రేయ్ (ఇదీ మనన్నే) ఇటు రారా ... నువ్వు వెనక ఎందుకు కూర్చున్నావు ?"
"సార్ వెంకట్రావు రోజు వెంకటప్పయ్య బోండాలు తెచ్చి , శీను కు (ఇదీ మనమే) పెడతాడు సార్..."
ల మ్డీ కాణ ముచ్చు లాగా ఉంటది. అన్నీ కనిపెట్టింది. పోలీసు కుక్క ముక్కు దీనిది ..
..
ఇంత జరిగాక కొత్త పంతులు ఊరుకుంటాడా ?
ఇద్దరి ఎముకలు కలిసి లెక్క పెడుతుండగా పాసు బెల్లు మోగింది.
.
మనసు కుతకుత లాడుతుంది.
దీన్ని రెండు జాడలు పట్టుకుని వంచి నా సామి రంగా దబీ.. దబీ ..
దబీ దబీ.. దబీ.. దబీ ..దబీ దబీ.. దబీ.. దబీ ..దబీ దబీ.......
.
లాబం లేదు.
ఏదో ఒకటి చెయ్యాలి .
.what to do ?
క్యా కర్నా?
.
బ్లేడు తో దాని పుస్తకాల సంచి కాడలు కోస్తే?..
.దాని కారేజి గిన్నె వంగదీస్తే?
దాని జామెట్రీ బాక్స్ చెట్లలో విసిరి పడేస్తే?
కొత్త పుస్తకాల అట్టలు చించేస్తే.?
.సంచి నిండా మట్టి పోస్తే ?
సం థింగ్ మస్ట్ బి డన్........
.
జేబులో చెయ్యి పెట్టా..
బ్లేడు ముక్క చుట్టిన కాగితం ఉండ,
ఒక పది పైసల బిల్లా?
దేనిని ఎలా ఎప్పుడు వాడాలి...
.
పాసు బెల్లు కొట్టి పదినిమిషాలయింది.
పుల్ల ఐ సు బండి చుట్టూ పోగయిన పిల్లలు తగ్గిపోయారు.
మంచి మంచి ఐస్ లు అయిపోయాక కరిగిన ఇసులు అమ్ముకునే పనిలో ఐస్ బండబ్బాయి.
.
అప్పుడొచ్చిందా ఆలోచన..
గబగబా వెళ్ళి 10 పైసలకి మూడు ఇసు లిస్తావా అడిగాను.( పుల్ల ఐస్ ఒక్కోటి 5 పైసలు )
కొంచెం కరిగిన మూడు ఐస్ లు ఇచ్చాడతాను.
ఒరేయ్ వెంకట్రావ్ .. వాడిని పిలిచి ఒకటిచ్చాను.పరిచయాలు నిలుపుకోవడం ఎలాగో
అప్పట్లోనే తెలిసిన వాడిని
“ పొట్టి దాన్ని వదలనురా...” .వాడి తో చెప్పాను.
.
"ఒరేయ్ పాసుబెల్లు తర్వాత తెలుగు పంతుకు క్లాసు రా .
ఆయన చెయ్యి మందం తెలుసుగా?" ఐస్ తింటూ హెచ్చరించాడు. వెంకట్రావు...
రెండో ఐస్ గబ గబా కొరికి తినసాగాను.
.
&&&
.
లోపలి బెల్లు కొట్టారు.
అప్పుడే వచ్చినట్టు నటించడాని చివరగా క్లాసు లో కెల్లా.
.
తెలుగు పంతులు లావుగా పొట్టిగా పంచే కట్టుకుని ఉంటారు.
అద్బుతంగా పాటం చెబుతారు. అంతే అద్బుతంగా వీపు వాయిస్తారు.
నిన్న ఎంత వరకు పాటం చెప్పాను? అందరూ నోట్సులు తియ్యండి.
.
నేను గ్రామ దేవతలందరిని పూజించసాగాను.
కానీ నేను పూజిస్తున్న విషయం వారికి తెలిసే లోపే....
.
ఆ రాకాసిది పెద్దగా కేక పెట్టింది. కరిగిన ఐస్ పుల్ల పట్టుకుని చూపిస్తూ
" సార్ నా నోట్స్ లో ఎవరో ఐస్ పెట్టారు అంది."
.
" ఎవర్రా అది .".హుంకరించాడు ఆయన.
.
లమిడిఖానా అదే పుళ్ళతో నావైపు చూపింది.
.
రేయ్ ఇలారా.. నువ్వేనా?
తప్పు చేసేవాడిని కానీ అబద్దం ఆడే వాడిని కాదు. ...
.
.” నేనే సర్..”
.
మా మాస్టారు ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది వింటే
నా శిక్ష తగ్గించు కునే వాడిని కానీ
ఆయన ఆ అవకాశం ఇవ్వలేదు.
.
అంతా ఐమ్యాక్స్ లో 150 టిక్కెట్టు పెట్టి మహేశ్ బాబు కొడితే
నేలకికరుచుకుని లేచి నిలబడ్డం, ఇప్పుడు చూశారు గాని
నా క్లాస్ మిత్రులు అప్పుడే చూశారు.
(1977-78 ప్రాంతాలలో మద్దిపాడు కడియాల యనాదయ్య ప్రబుత్వ కళాశాల
లోని తెలుగు మాస్టారి వేలి ముద్రలు కావల్సిన వారు
ఇప్పుడైనా నా వీపు మీద సేకరించు కోవచ్చు)

No comments: