Saturday, 30 May 2015

వాళ్ళు


మా నాన్న గారు తాలూకా ఆఫీసు తాసిల్దారు గా పని చేస్తున్న రోజుల్లో
ఆయన గొడుగు మోయటానికి,
ఆయన తువ్వాలు ముట్టు కోటానికి,
ఆయన చెప్పులు తుడవటానికి పోటీలు పడే వాళ్ళు ___
..
ఇంటి ముందు డజన్ల కొద్ది వాహనాలు ,
రకరకాల మనుషులు నాన్నగారు తయారయ్యే బయటకు రాగానే
వంగి నమస్కరించడానికి రిహార్సిల్స్ చేసుకునే రోజుల్లో
ఆయనకి వాళ్ళకి మద్య చిల్లర పోగుచేసుకునే, వాళ్ళు __
..
మా ..మేనమామ పినతల్లి కోడలు బిడ్డ తాతగారి తమ్ముడు
వేలు విడిచిన ఆడబిడ్డ చిన బామర్ది స్నేహితుడికి
స్వయానా మేనమామ పినతల్లి సవతి బిడ్డ లాంటి
చుట్టరికాలు కలుపుకుని వంటింట్లో అంట్లు తోమి,
బజారు నుండి కూరగాయలు తెచ్చి,
వంటింట్లో తిని వరండా లో పడుకునే, వాళ్ళు ___
..
నన్ను మా చెల్లెల్ని బుజాన వేసుకుని వీపున ఎక్కించుకుని తిప్పి,
మేం సగం కొరికి వదిలేసిన బిస్కెట్టు ముక్కలు
చాటుగా దాచుకుని తినే , వాళ్ళు __
..
అటెండరు వద్ద నుండి హెడ్ గుమస్తాల వరకు
పైరవీలు చెప్పించుకుని పనులు పూర్తి చేయించుకునే, వాళ్ళు __
..
ఆయన గుండెజబ్బుతో మమ్మల్ని వీడిపోతే
శవం మోయటానికి కూలివాళ్ళ కోసం మా అమ్మ బజార్ణ పడితే
ముఖం చాటేసి చాటుగా వచ్చి సానుభూతి మాటలు చెప్పి
కల్లబొల్లి ఎడ్పులు ఏడ్చిన, వాళ్ళు __
..
మా చదువులకి సంద్యలకి ఉన్న సొమ్ము హరించుకు పోయి
అమ్మ ఉన్న పొలం అమ్మల్సి వస్తే, కమిషన్ తో ఇల్లు కట్టిన వాళ్ళు ___
..
పద్దెనిమిది సంవత్స్రాల శరీరాన్ని పన్నెండేళ్ళు దాటని చెల్లెల్ని
తీసుకుని దిక్కు తెలియని నేను వీదిన పడితే
వీది తలుపు తాళం వేసుకుని దొడ్డి త్రోవన తిరిగిన , వాళ్ళు __
..
నాలుగొందల రూపాయలకి పెద్ద దుకాణం లో..
రోజుకి పన్నెడు గంటలు సేల్సు గర్ల్ గా పనిచేస్తు ఉంటే
ఆ కొట్టుకొచ్చి ఇంస్టెంట్ కాఫీ పొడిని ,
కాశ్యునట్ పాకెట్లని కొనుక్కుని నన్ను గుర్తించని (?) వాళ్ళు __
..
వీడిన నడుస్తుంటే పోకిరి  కుర్రాళ్ళు ఈల వేస్తే..
కంట్లో ఆగే మేఘం వర్షించడాన్ని కర్చీఫ్ తో దాచేస్తుంటే
పక్కనే పోతూ పళ్లికిలించే వాళ్ళు __
..
ఎప్పుడో యే పండగ కో ఒకసారి గుర్తొచ్చి
పెద్దరికంగా పలకరిస్తే గుండెల లోని బాద కళ్ళలో వర్షిస్తే
“ ఊరుకోమ్మా __ యెడిస్తే పోయిన రోజులు వస్తాయా “
అంటూ తాకకూడని ప్రదేశాలు తాకే వాళ్ళు __
..
నన్ను ఏమిటో తెలుసుకుని, ..
నా బాద్యతలు చూసి జాలిపడి సానుభూతిగా ,
ప్రేమగా ,ఆప్యాయంగా మాట్లాడే అతనితో
ఎప్పుడయినా ఒక పది నిమిషాలు బజారులో
కలిసి నడిస్తే “తిరుగుబోతు” గా ముద్రించిన , వాళ్ళు __
..
నా ఒంటరి పోరాటానికి చేయూతగా నేనున్నానంటూ..
అతనే ముందుకొచ్చి చేతులు చాచి హృదయ గవాక్షాలు తెరిస్తే ,
అర్ధం కాక దైర్యం కోసం ప్రాకులాడితే ,
‘లేచిపోతావా’ అని సూటిగా అడిగిన, వాళ్ళు __
..
ఒంటరితనానికి భయపడి , వణికి ,..
స్వయంగా నిర్ణయం తీసుకుని ‘అతడి’ చేతిని అందుకుంటే,
కులం మంట కలిపావు కాదే బ్రస్టు రాలా అని వెలివేసిన , వాళ్ళు __
..
అంతా అయిపోయాక , ..
కడుపో కాలో వచ్చి ఉంటుంది టక్కున ఎవడో ఒకడిని తగులుకుంది.
పెళ్లి పెటాకులు చేయటానికి మేము లేమా?
అని చాటుగా గుండెలు బాదుకున్న, వాళ్ళు __
..
రేపు నా బిడ్డల్ని , విది గాలపు ఎరల్ని , ..
నా దేశపు అభాగ్యులని ,
గుచ్చి గుచ్చి చంపే ఈ శాడిస్టిక్ రాక్షసులయిన వాళ్ళు __
..
బఃగవంతుడా!! వీరి నుండి ఈ సమాజాన్ని రక్షించు తండ్రీ..

... :(  :(  :(
(కోస్తావాణి , రాజమండ్రి 1989 నా శ్రీమతి సుంకర రామాంజని పేరుతో )

2 comments:

chitralaxman said...

మొత్తం మొదటి నుంచి ఈ రోజు వరకు మీరు వ్రాసిన పోస్ట్ లన్నీ చదివేసాను.చాలా బాగున్నాయి.

Sreenivasarao Sunkara said...

దాన్యవాదాలు . నమస్తే :)